– కాషాయం కోటలో హస్తం మాదిరి బీటలు
– వ్యక్తిగత ఇమేజ్ ల కోసం ప్రయత్నాలు
– ముందే అలర్ట్ అయిన ఢిల్లీ నాయకత్వం
– తెలంగాణ కాషాయ నేతలకు వార్నింగ్!
– ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశాలు
– త్వరలోనే బీజేపీ అగ్ర నేతల పర్యటనలు
– చేరికలపై ప్రధాన దృష్టి..
– ఫిబ్రవరి నుంచి జోరందుకునే ఛాన్స్
– రాష్ట్రవ్యాప్తంగా హడావుడి ఉండేలా ప్లాన్స్
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. ఒక పంచాయితీ తీరిందని అనుకునే సమయానికి ఇంకొకటి తెరపైకి వస్తుంది. క్రమంగా సఖ్యత లోపించి డైరెక్ట్ ఎటాక్ కే దిగుతున్నారు హస్తం నేతలు. ఢిల్లీ నుంచి పెద్దలు రావడం.. సర్దుబాటు కార్యక్రమాలు చేయడం కామన్ అయిపోయింది. కానీ, వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని కాన్ఫిడెంట్ గా చెబుతుంటారు ఆ పార్టీ నేతలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉందనేది రాజకీయ పండితుల వాదన. కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు.. రేవంత్ సొంత మైలేజ్ కోసమే తాపత్రయపడుతున్నారని విమర్శిస్తుంటారు. బీజేపీలో కూడా బండి సంజయ్ ని అలాగే టార్గెట్ చేస్తున్నవారు ఉన్నారని అనుమానిస్తున్నారు విశ్లేషకులు.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చింది. మాస్ డైలాగులతో, భారీ సభలతో ఆయన పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. ఈయన కూడా రేవంత్ మాదిరి సొంత అజెండా కోసమే తాపత్రయపడుతున్నారని కాషాయ వర్గాల్లో చర్చించుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ కూడా బండికే మైలేజ్ తీసుకొచ్చిందని గుర్తుచేస్తున్నారు. గ్రామగ్రామాన పార్టీ బలోపేతం అంతగా జరగలేదని అంటున్నారు. కాంగ్రెస్ లాగే బీజేపీ కూడా గ్రూపులుగా విడిపోయిందని.. కాషాయ నేతలు కూడా వాళ్లలాగానే ఈసారి అధికారం తమదేనని చెబుతున్నారని రెండు పార్టీలను పోల్చి చెబుతున్నారు రాజకీయ పండితులు.
అయితే.. కాంగ్రెస్ అగ్రనాయకత్వంలా చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా బీజేపీ పెద్దలు ముందుగానే గ్రహించి అన్నీ సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. అందుకే తెలంగాణ కేంద్రంగా వరుస సమావేశాలు, టూర్లు పెట్టుకుని అప్పుడప్పుడు పార్టీ నేతలకు క్లాస్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. పాదయాత్రలు చేసి వ్యక్తిగత ఇమేజ్ లు పెంచుకోవడం కన్నా.. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని తాజాగా స్పష్టం చేసినట్లుగా వివరిస్తున్నారు విశ్లేషకులు. ఇకపై గ్రామ, గ్రామానికి వెళ్లాలని స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం వంటి వాటితో దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.
త్వరలో ప్రధాని మోడీ, అమిత్ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇదే సమయంలో నేతల కొరతను అధిగమించేందుకు ఇతర పార్టీల్లోని వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో.. అసంతృప్త నేతలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఫిబ్రవరి నుంచి చేరికలపై మరింత ఫోకస్ ఉంటుందని తెలుస్తోంది. ఈలోపు ఎలాంటి విభేదాలు లేకుండా బండి నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా అందరూ సఖ్యతతో గ్రామగ్రామానికి పార్టీని తీసుకెళ్లాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.