– రేవంత్ కు తలనొప్పిగా సీనియర్లు
– అశోక హోటల్ లో స్పెషల్ మీటింగ్
– అలర్ట్ అయిన ఏఐసీసీ
– అందరికీ ఫోన్లు.. వెనక్కి తగ్గిన కొందరు
– రేవంత్ కు జగ్గారెడ్డి సవాల్
– చీలికలు వద్దంటున్న ఇతర నేతలు
– టీఆర్‌ఎస్ ట్రాప్ లో పడొద్దని సూచన
– సీనియర్ల తీరుతో పార్టీలో గందరగోళం!
ఓ అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు వెనక్కి అనేలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. టీఆర్‌ఎస్ సర్కార్ ను గద్దె దించుతాం.. వచ్చేది తమ ప్రభుత్వమే అని ఓవైపు సభలు, సమావేశాలు అని రేవంత్ రెడ్డి తిరుగుతుంటే.. ఇంకోవైపు సీనియర్లు తమది ఇంకో దారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అశోక హోటల్ లో సమావేశం అయ్యారు. అయితే.. ఈ భేటీతో ఏం సాధించారనే ప్రశ్న వేస్తే మాత్రం.. కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.
ఆదివారం ఉదయం 11 గంటలకు కొందరు సీనియర్ నేతలు సమావేశం అయ్యారు. అంతకుముందే హైకమాండ్ అలెర్ట్ అవడంతో చాలామంది లాస్ట్ మినిట్ లో సైలెంట్ అయిపోయారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఫోన్లతో వెనక్కి తగ్గారు. మీటింగ్ లు పెట్టొద్దని ఏమైనా సమస్యలుంటే నేరుగా సోనియా, రాహుల్ గాంధీతో చర్చించాలన్నారు. నిజానికి ఆయన అన్నదాంట్లో ఎలాంటి తప్పు లేదంటున్నారు విశ్లేషకులు. రేవంత్ రెడ్డితో ఇబ్బందిగా ఉంటే ఢిల్లీ పెద్దలతో చర్చించాలి గానీ.. ఇలా మీటింగులు పెట్టి పరువు పోగొట్టుకోవడం అవసరమా? అనే ప్రశ్న వేస్తున్నారు.
మీటింగ్ లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఉదయం గాంధీ భవన్ లో ప్రెస్‌మీట్ పెట్టి సీనియర్లపై సీరియస్ అయిన అద్దంకి దయాకర్ సడెన్ గా హోటల్ దగ్గర కనిపించడం. అయితే.. ఆయన్ని సీనియర్లు ఎవరూ పట్టించుకోలేదు. ఇది అసమ్మతి భేటీ కాదని.. కేవలం పార్టీ విధేయుల సమావేశమని మర్రి శశిధర్ రెడ్డి చెప్పినా.. దానికి భిన్నంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జగ్గారెడ్డి విమర్శలు చేయడం చూసి రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
మాణిక్కం ఠాగూర్ తో కలిసి పార్టీకి రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారనేది జగ్గారెడ్డి వాదన. తమని సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదని.. ఒకవేళ చేస్తే రోజుకొకరి బండారం బయట పెడతానని హెచ్చరించారు. రేవంత్ కు దమ్ముంటే తన నియోజకవర్గంలో అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటే ఆయన హీరో అని ఒప్పుకుంటానని అన్నారు. పార్టీ సిద్ధాంతంలో రేవంత్ పని చేయడం లేదని ఆరోపించారు. ఈ పరిణామాలన్నీ చూస్తున్న పార్టీలోని మిగిలిన నేతలు సీనియర్ల అసలు ఉద్దేశం ఏంటని మాట్లాడుకుంటున్నారు. రేవంత్ తో సమస్య ఉంటే.. ఢిల్లీకి వెళ్లాలి గానీ ఇలా హోటల్స్ లో మీటింగులు పెట్టి కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారని నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ లో చీలికలు తెచ్చి ఎదగకుండా చేస్తున్నారని కేసీఆర్ పై ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు కొందరు నేతలు. బ్రిటీష్ పాలన లాగే.. కాంగ్రెస్ నేతల్లో చిచ్చు పెట్టి టీఆర్ఎస్ చోద్యం చూస్తోందని తరచూ విమర్శిస్తుంటారు. ఈక్రమంలోనే సీనియర్లు మీటింగ్ పెట్టుకోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు నేతలు. అధికార పక్షం ట్రాప్ లో పడొద్దని సూచిస్తున్నారు. రేవంత్ టీపీసీసీ అయ్యాక ఎక్కడ సభ పెట్టినా జనం తరలివస్తున్నారని.. పార్టీ బలోపతం అవుతోందని.. ఇలాంటి సమయంలో ఈ కుమ్ములాటలు నష్టాన్ని తెచ్చిపెడతాయని హితవు పలుకుతున్నారు.