– పార్టీని సెట్ రైట్ చేసే పనిలో అగ్ర నాయకులు
– నేతలకు టార్గెట్ లు, వార్నింగులు
– యూత్ డిక్లరేషన్ పై ఫోకస్
– ఒక్కో నియోజకవర్గంలో 25వేల మంది లక్ష్యం
– టికెట్ల విషయంలోనూ ఫుల్ క్లారిటీ
– నేతలు లక్ష్యాలన్నీ చేరుకుంటారా?
కర్ణాటక ఫలితాల ఊపులో తెలంగాణలో కూడా పాగా వేస్తామనే ధీమాతో ఉన్నారు హస్తం నేతలు. కానీ, అక్కడి గెలుపునకు సమిష్టి కృషి కలిసొచ్చింది. సిద్దరామయ్య వ్యూహాలు ఫలించాయి. పార్టీ నేతలను ఒక్కతాటిపై ఉంచడంలో డీకే ఐడియాలు వర్కవుట్ అయ్యాయి. మరి, తెలంగాణలో ఆ పరిస్థితులు ఉన్నాయా? అంటే రాజకీయ పండితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయింది. కొందరు నేతలైత కీలకమైన ఈ సమయంలో సైలెంట్ గా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇలాగే ఉంటే గెలవడం కష్టమని అగ్ర నేతలు భావిస్తున్నారు. అందుకే, తమ నాయకులకు టార్గెట్ లు పెడుతున్నారు. దీనివల్ల పార్టీకి ప్లస్ అవుతుందనేది వారి ఆశ. ఈమధ్యే ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను జనంలోకి తీసుకెళ్లాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో 25 వేల మందితో ఎన్రోల్ చేయించాలని పార్టీ నేతలను ఆదేశించారు. అంతేకాదు, ఈ టార్గెట్ రీచ్ అయితేనే.. టికెట్ పరిశీలన అని స్పష్టం చేశారు. లేదంటే పేరు కూడా పరిశీలన జాబితాలో ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
ఇటు పార్టీ నేతలను ఏకం చేసేందుకు, చేరికలను ప్రోత్సహించేందుకు 10 అడుగులు వెనక్కి వేయడానికైనా సిద్ధమని ప్రకటించారు రేవంత్. కాంగ్రెస్ లో కోవర్టులు లేరని.. అందరం కలిసి మెలిసి ముందుకెళ్దామని క్లారిటీగా చెప్పారు. అయితే.. కొందరు నేతలు మాత్రం రేవంత్ తో కలిసి రావడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఎవరికి వారు తమ నియోజకవర్గాలు, తమకున్న పరిచయాలతో పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.
మరోవైపు టీపీసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే సైతం పార్టీ నేతలకు క్లియర్ ఆదేశాలు ఇచ్చారు. ఒక రకంగా హద్దు దాటితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీని నష్టపరిచే పనులు ఎవరు చేసినా యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. డిసిప్లెన్ ఉండాలి.. పొరపాటున కూడా డ్యామేజ్ అయ్యే పనులు ఎవరూ చేయకూడదని అంటున్నారు. అంటే.. రేవంత్, థాక్రే పాయింట్ ఒక్కటే. సమిష్టిగా పోరాడదాం.. కాంగ్రెస్ ను గెలిపించుకుందామని అంటున్నారు. అయితే.. నేతలు దీన్ని పర్సనల్ గా తీసుకుంటారా? అందరూ కలిసి అడుగులేస్తారా? రేవంత్ సారథ్యంలో ముందుకెళ్తారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.