సుంకర నరేష్
ప్రముఖ హైకోర్టు న్యాయవాది
వైద్య శాస్త్రానికే అంతు చిక్కని మహమ్మారి కరోనా వైరస్ చైనా వుహాన్ నగరం లో తన ఉనికి మొదలు పెట్టి మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్న సంగతి మనం గత సంవత్సరం డిసెంబర్ నెల నుండే వార్త మాధ్యమాల ద్వారా చూస్తున్నాము. ఇలాంటి విపత్కర పరిస్థితులు పక్క దేశాల్లో ఉండి మన దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసినపుడు ముందస్తు హెచ్చరికలు చేయడానికి కేంద్ర నిఘా సంస్థలు ఎల్లప్పుడూ సంసిందంగా ఉండాలి. కానీ అవి వాటి పని చేయలేదు ఫలితం మొదటి కరోనా మరణం మనదేశంలో జనవరి 30న కేరళ లో చూసాం. అసలే మందులేని రోగం. కావలసినన్ని ఐసీయూ గదులు, డాక్టర్ల మాస్క్‌లు కూడా లేవు. మార్చి 19 దాకా నాయకులూ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. చేసేదేమిలేక హఠాత్తుగా జనతా కర్ఫ్యూ ప్రకటించారు. దాని కొనసాగింపుగా లాక్‌డౌన్ మొదలైంది. ఎయిర్ పోర్టులు, రైళ్లు, బస్సులు, మెట్రోలు నిలిచిపోయాయి. అప్పటివరకు దేశం లో అక్కడక్కడా అరా కోరగా పాజిటివ్ కనిపించిన కేసులు హమ్మయ్యా, కరోనా వైరస్ కంట్రోల్ లోకి వస్తోంది, లాక్ డౌన్ ముగిసే నాటికి అంతా సర్దుకుంటుంది అనుకుంటుండగా ఒక్కసారిగా నిజాముద్దీన్ తబ్లిఘీ మతప్రచారకుల ప్రవేశంతో పరిస్థితి తలకిందులైంది. పరవాలేదు వ్యాధి సోకినా వారిని గుర్తించి ఐసొలేషన్ కి పంపిస్తున్నాము అని దైర్యంగా ఉన్న ప్రభుత్వాలకి గుండెల్లో రాయి పడినట్లయింది. విదేశీ టూరిస్టు వీసాల మీద వచ్చి, మత ప్రచారాల్లో పాల్గొంటూ ఉంటే, వీసా గడువు దాటి ఇక్కడే ఉంటూ, లాకౌట్ తరువాత కూడా వీరు ఢిల్లీ మధ్యలో నివసిస్తూ, అక్కడనుంచి వేలాది మంది విదేశీయులు, స్వదేశీయులు గ్రామాలకు తరలిపోతూ ఉంటే, మాకేమి పట్టనట్టు మొద్దు నిద్ర పోయిన నిఘా వ్యవస్థ, విదేశీ మంత్రిత్వశాఖల పనితీరు వల్ల 123 కోట్లకు పైగా ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ,వారి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకుంటూ ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తబ్లీఘీ ఏం చేస్తుందో నిఘా వాళ్లకు తెలి యదా? కౌలాలంపూర్‌లోని శ్రీ పెటాలింగ్ మసీదులో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 దాకా జరిపిన తబ్లీఘీ సమావేశాలలో పదహారు వేలమంది పాల్గొనడం,ఆగ్నేయాసియాలో కరోనా వైరస్‌ను భయానకంగా వ్యాప్తి చేసిన మహాసభగా దీనికి అపకీర్తి రావడం సామాన్య జనాలకే తెలిసినపుడు నిఘావారికి తెలియదా? వారి కదలికల మీద కన్నేసి ఉంచాల్సిన బాధ్యత లేదా? 500 మందికి వీరు వైరస్ అంటించారని వార్తలు వచ్చాయి. ఇండోనేసియా వణికిపోయింది. ‘ఈ ప్రపంచంలో జీవనసౌఖ్యం కొంతే, మరణించిన తరువాత ఆనందంతో పోలికే లేదు’ అని మలేసియాలో తబ్లీఘీ ప్రచార నినాదం. పాక్‌లో కూడా వీరు లాక్‌డౌన్ లను, కర్ఫ్యూలను ధిక్కరించి మసీదుల్లో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఒకరికి అంటిస్తే నేరం. కాని వందలాది మందికి కరోనా కావాలని తగిలిస్తే జనహనన ఘోరం కాదా? జరగాల్సిన ఘోరం జరిగిపోయాక చేతులు కాలాక ఆకులూ పట్టుకున్నట్టు కేంద్ర హోంశాఖ దేశంలో ఉన్న సుమారు 960 మంది విదేశీ తబ్లిఘీలను బ్లాక్‌లి్‌స్టలో పెట్టింది. వీరంతా టూరిస్ట్ వీసాలపై వచ్చినవారు.ఇలా వచ్చినవారు మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అంటూ చట్టం మాట్లాడుతుంది.
వీసా రూల్స్‌ను ఉల్లంఘించిన వీరందరిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల పోలీస్ అధికారులను ఆదేశించారు. వారు ఎక్కడ ఉన్నా పిలిపించండి. విదేశీయుల చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెట్టండి’ అని హోంశాఖ మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. లాక్‌డౌన్ విధించాక కూడా నిజాముదీన్ దర్గాలో 2300 మంది ఒకేచోట ఆవాసం ఉండడం, వారిలో 250 మంది విదేశీయులు కావడం వివాదం రేపింది. ఈ 2300 మందిలో 300 మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది. మర్కజ్‌కు హాజరైన వారిలో 15 దేశాలకు చెందిన వారున్నట్లు హోంశాఖ అంచనా. తబ్లిఘీ సమావేశాల్లో హాజరైన వేలాది మంది దేశంలో ఏ మూలకు వెళ్లి ఎందరిని కలిశారో ఆరా తీయడానికి వారిని వెంటాడి వేటాడి పట్టుకుని ఒంటరి చేసి, బస్సుల్లో దవాఖానలకు తీసుకుపోవడానికి ఒక కేంద్ర ప్రభుత్వం, అనేకానేక రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతి పదికన చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీలో వారిని దవాఖానకు తరలిస్తుంటే సిబ్బందిమీద తుమ్ముతూ రోడ్ల మీద ఉమ్మడం ఒక ఎత్తైతే , ఘజియాబాద్ ఆస్పత్రిలో చేరిన ఆరుగురు మర్కజ్ సభ్యులు హాస్పిటల్లో ప్యాంట్లు విప్పేసి అర్థనగ్నంగా తిరుగుతూ నర్సుల పట్ల అసభ్యంగా,చేతి వేళ్లతో అసభ్యకరమైన సింబల్స్ చూపిస్తూ, సిగరెట్లు, బిర్యాని కావాలని అడుగుతూ, నోటికొచ్చిన భాష వాడటం తో జాతీయ భద్రత చట్టం మరియు ఐపీసీ సెక్షన్ 354, 294, 509, 269, 270, 271 ప్రకారం కేసులు నమోదు చేసారు.
చట్టం తెలియనంత మాత్రాన తప్పించుకోలేరు అనేది జగమెరిగిన న్యాయ సూత్రం దానికి ఎవరు అతీతులుకారు సాధారణ గృహహింస కేసులోనే విదేశాల్లో ఉన్న భర్తల మీద లుకౌట్ నోటీసు జారీచేస్తేనే ఇక్కడ విమానాశ్రయాల్లో దిగగానే వారిని బంధించి సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించేంత ఆధునూతనమైన ప్రక్రియ అవలంబిస్తున్న అధికారులకు విదేశీ టూరిస్టు వీసాల మీద దేశప్రజల ప్రాణాల్ని హరించే మహమ్మారిని టికెట్ కొని మరి తీసు కొచ్చి, మత ప్రచారాల్లో పాల్గొంటూ, వీసా గడువు దాటి ఇక్కడే ఉంటే కళ్ళు మూసుకుని కాలం గడిపిన అధికారుల మీద వ్యవస్థ మీద కేసులు ఎందుకు పెట్టకూడదు ఇది వారి అధికార నిర్లక్ష్యం కాదా, జాతీయ భద్రత అంశం కాదా? మరి ఇవన్నీ అధికారులకు, పాలకులకు తెలియని విషయాలు కాదు , వారి తప్పును కప్పి పుచ్చుకోవడానికి సమస్యలని పక్కదోవ పట్టించడానికి వాటికీ మత రాజకీయ, వర్గ, రంగుపులమడం వారిముందున్న ఏకైక మార్గం. ఏదిఏమైనా ఈ విధమైన విధులు నిఘా వర్గాలు నిర్వహిస్తే భారతదేశ భవిష్యత్తు చాల ప్రమాదం లో పడే అవకాశం ముమ్మాటికీ ఉంటుంది.