కోర్టుధిక్కార కేసులో నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు హైకోర్టు శిక్ష విధించింది. ప్రతి వారం రెండు గంటల పాటు అనాథాశ్రమంలో గడపాలని కలెక్టర్ ను ఆదేశించింది. ఇలా ఆరు నెలల పాటు కచ్చితంగా వెళ్లాలని కోర్టు సూచించింది.
ఇక ఇదే కేసులో ఉన్న మరో అధికారి సంధ్యారాణికి కూడా కోర్టు శిక్షను ఖరారు చేసింది. మీరు చేసిన తప్పుకు శిక్షగా…రాబోయే ఉగాధి, శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న అనాథ ఆశ్రమాల్లో భోజనం పెట్టాలని ఆదేశించింది.
ఓ కేసులో ఈ ఇద్దరు అధికారులకు కోర్టు ధిక్కరణ కింద రెండు వేలు జరిమానా విధిస్తూ… సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని కలెక్టర్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయగా… సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవరిస్తూ డివిజన్ బెంచ్ సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. విచారణను ముగించింది.
ఇక ప్రభుత్వ అధికారుల కోర్టు ధిక్కరణ చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కోర్టు ఆదేశాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ… కోర్టు ధిక్కరణ శిక్ష పడితే.. అప్పీల్ చేస్తే సరిపోతుందని భావిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులకే ఇద్దరు ముగ్గురు జడ్జీలను పెట్టాల్సి వచ్చేలా ఉందని హైకోర్టు మండిపడింది. తమ ఆదేశాలను అధికారులు తేలిగ్గా తీసుకుంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.
హైకోర్టు ముందు సిద్దిపేట, సిరిసిల్ల, సంగారెడ్డి అదనపు కలెక్టర్ల కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.