ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహాణలో ప్రభుత్వం- ఎన్నికల కమిషన్ మధ్య తలెత్తిన వివాదంలో హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లుగా ఫిబ్రవరిలో ఎన్నికలు సాధ్యం కాదంటూ ప్రభుత్వం కోర్టుకు తెలపగా… ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనేది ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని, అందులో ఇబ్బందులో ఉంటే కమిషన్ కు చెప్పాలని కోర్టు గతంలోనే ఆదేశించింది.
ముగ్గురు ఉన్నతాధికారులను కమిషన్ వద్దకు పంపి… ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు తెలపాలని, ఆ తర్వాత కమిషన్ సరైన నిర్ణయం తీసుకుంటుందని కోర్టు ఆదేశించింది. తాజాగా అవే ఆదేశాలను ఉటంకిస్తూ మంగళవారం నుండి మూడు రోజుల లోపు ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారులను కమిషన్ వద్దకు పంపి అభ్యంతరాలను తెలపాలని ఆదేశించింది.
కరోనా వ్యాక్సినేషన్ వేయాలని కేంద్రం మార్గదర్శకాలిచ్చినందున అప్పటి వరకు ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోర్టులో వాదించింది. అయితే, ఎన్నికల షెడ్యూల్ కరోనా వ్యాక్సినేషన్ షెడ్యూల్ కు ఆటంకంగా ఉంటే ఎన్నికల సంఘం ఇతర తేదీలను ఎంచుకుంటుందని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.