గతేడాది వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది న్యాయస్థానం. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు మూడు నెలల్లోగా ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని ఆదేశించింది. అలాగే నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది.
గతేడాది సెప్టెంబర్ తర్వాత భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలో వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించి పరిహారం ఇచ్చేలా చూడాలని రైతు స్వరాజ్య వేదిక కిరణ్ కుమార్, కన్నెగంటి రవి, ఆశలత పిటిషన్ దాఖలు వేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పంట దెబ్బతిన్న రైతులను త్వరగా గుర్తించి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా అందేలా చూడాలని తెలిపింది హైకోర్టు.