రాంకీ ఇంటిగ్రేడెట్ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 227లో రాంకీ ఇంటిగ్రేటెడ్ సంస్థ నిర్మించిన డిస్కవరీ సిటీ, గార్డెనియా గ్రోవ్ విల్లాస్, గ్రీన్‌వ్యూ అపార్ట్‌మెంట్స్, ది హడుల్, గోల్డెన్ సర్కిల్ ప్రాజెక్టుల విల్లాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి పెండింగ్ లో పడింది.
అయితే రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని సబ్ రిజిస్ట్రార్‌కు గతంలో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హెచ్‌ఎండీఏ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2008లో రాంకీ సంస్థ ఇంకా హెచ్‌ఎండీఏ మధ్య తొలి ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా 400 ఎకరాల్లో 375 ఎకరాల ప్రైవేట్ భూముల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.
దీంతో అగ్రిమెంట్ అమలు కోసం రాంకీ సంస్థ రూ.100 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. తొలివిడతగా రూ.25 కోట్లు చెల్లించింది. అయితే, వంద ఎకరాల్లో చేపట్టిన విల్లాలను, ప్లాట్లను అమ్మేందుకు రాంకీ ప్రయత్నిస్తే అది అగ్రిమెంట్‌కు వ్యతిరేకమని చెప్తూ రిజిస్ట్రేషన్ శాఖకు హెచ్‌ఎండీఏ లెటర్ రాసింది. దీంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో రాంకీ ఇన్‌ఫ్రా, రాంజీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి.
వీటిని విచారించిన సింగిల్ జడ్జి.. రిజిస్ట్రేషన్లను అనుమతించాలని తీర్పు చెప్పారు. తాజాగా సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. రాంకీపై గతంలో ఇద్దరు రైతులు దాఖలు చేసిన కేసులతో ఈ రిట్‌ను కూడా కలిపి ఈ నెల 23న విచారిస్తామని తెలిపింది. మరో వైపు తమ బకాయిలు చెల్లించే వరకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని హెచ్ఎండీఏ పట్టుబడుతోంది.