ఏపీ సర్కారు తామిచ్చిన జీవోలను పబ్లిక్ డొమైన్ నుంచి తొలగిస్తూ ఇచ్చిన జీవోలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. జీవోల తొలగింపుపై పిటిషన్లు వేశాక.. సీక్రెట్,టాప్ సీక్రెట్,కాన్ఫిడెన్షియల్ పేరుతో మరో జీవో తీసుకురావడం చట్టవిరుద్ధమని న్యాయవాది బాలాజీ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.
జీవో 100 పేరిట.. కొత్త జీవోలను బహిరంగపరచాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4, 8కు ఇది విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత 15 ఏళ్లుగా పబ్లిక్ డొమైన్లో సమాచారాన్ని ప్రభుత్వాలు అప్ లోడ్ చేస్తున్నాయని, కొత్తగా ఇప్పుడు ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బందికరంగా మారిందో అర్థం కావడం లేదని చెప్పారు.
సీక్రెట్,టాప్ సీక్రెట్,కాన్ఫిడెన్షియల్ పేరుతో జీవోలను పెట్టకపోవడంపై హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అభ్యంతరాలపై వివరణ ఇచ్చేందుకు వారం సమయం కోరారు ప్రభుత్వం తరుపు న్యాయవాది. దీంతో తదుపరి విచారణ వారానికి వాయిదా వేశారు.