పని చేయించకుండా ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలా చేస్తే.. ప్రజాధనం వృథా అయినట్టేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై రిటైర్డ్ ఉద్యోగి నాగధర్ సింగ్ దాఖలు చేసిన పిల్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం కొంత మందికి జీతాలు చెల్లిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదన కోర్టు ముందు వినిపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై స్పందిస్తూ.. పనిచేయించుకోకుండా జీతాలు ఇస్తే ప్రజాధనం వృథా అయినట్టేనని కోర్టు వ్యాఖ్యానించింది.
వెయిటింగ్‌లో ఎంతమంది ఉన్నారో కోర్టుకు లెక్కలు సమర్పించాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ చర్యలేమిటో నివేదిక రూపంలో అందజేయాలని సూచించింది. కేసు విచారణ సందర్భంగా ఉన్నంత న్యాయస్థానం సీఎస్ సోమేశ్ కుమార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంత వరకు ఈ కేసుపై ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. మరోసారి కౌంటర్ దాఖలు చేయకపోతే.. వ్యక్తగతంగా కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుందని సీఎస్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.