ఏపీలో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఫిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీ రఘురామపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు, నమోదు కాని ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలని ఏపీ హోంశాఖకు హైకోర్టు ఆదేశించింది. తనపై నమోదైన కేసుల విషయంలో చట్టపరంగా తనకున్న హక్కులను ఉపయోగించుకునేందుకు రఘురామకు అవకాశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎంపీ రఘురామ కృష్ణరాజుపై నర్సాపురంతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో పోలీస్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున తనపై ఉన్న కేసులు నమోదు చేస్తున్నారని రఘురామ గతంలో ఆరోపించారు. తనపై దాఖలైన కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీకి రఘురామ లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎంపీ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నియోజక వర్గానికి వచ్చేందుకు అవకాశం లేకుండా అక్రమంగా తన క్లయింటుపై కేసులు బనాయిస్తున్నారని ఉమేష్‌చంద్ర వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తరపున హోం శాఖ న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఉమేష్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రఘు రామకృష్ణపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు, రిజిస్టర్ కాకుండా ఉన్న వివరాలు కూడా వెంటనే అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాద్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.
ఎంపీ రఘు రామకృష్ణ రాజు దాదాపు రెండున్నరేళ్లుగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. గతంలో ఓసారి సిఐడి పోలీసులు రఘురామను అరెస్ట్ కూడా చేసింది. ఆ సమయంలో పోలీసులు తనపై దాడి చేశారని రఘురామ ఆరోపించారు. కోర్టు జోక్యంతో రఘురామ విడుదలయ్యారు. మరోవైపు పోలీసులు అరెస్ట్ చేస్తారనే అనుమానంతో గత రెండున్నరేళ్లుగా సొంత నియోజక వర్గానికి సైతం ఎంపీ దూరం అయ్యారు.