తెలంగాణలో మరోసారి ఎన్నికల శంఖారవం మోగనుంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పూర్తవగానే… ఎప్పటి నుండో వేచిచూస్తోన్న మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌స్నిగల్ ఇచ్చింది. జులైలోనే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమయినా… ఓటర్ల జాబితాపై కొందరు కోర్టుకెక్కారు. దాంతో ఎన్నికలపై కోర్ట్ స్టే ఇచ్చింది.
కోర్ట్ ఒకే చెప్పటంతో… ఎన్నికల వేడి మరోసారి మొదలవనుంది. కొత్త మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా ముందస్తుకు వెళ్లేందుకు అప్పట్లో కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి.
కానీ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలకు వెంటనే వెళ్తారా… కాస్త వాయిదా వేస్తారా అన్న చర్చ మొదలైపోయింది. ప్రస్తుతం ఓవైపు ఆర్టీసీ సమ్మె, కార్మికుల నిరసనతో ప్రతిపక్షాలు ఆక్టివ్‌గా ఉన్నాయి. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే… టీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిణామమే అవుతుంది. పైగా స్థానిక ఎన్నికలు కావటంతో లోకల్ ఇష్యూస్ కీలకం అవుతాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు ఎన్నికలపై ఆందోళనగా ఉండగా.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను విజయ తీరాలకు చేర్చటం కేసీఆర్‌కు అగ్నిపరీక్షే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉన్న నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలు కేటీఆర్ పనితీరుకు నిదర్శనం కాబోతున్నాయి.