ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. ఈ కేసులో ప్రభుత్వం చేసిన అప్పీల్ పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. కేసు ఫైల్స్ ఇవ్వాలంటూ సీబీఐ ఒత్తిడి చేస్తోందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.

ఫైల్స్ కోసం సోమవారం వరకు ఎలాంటి ఒత్తిడీ చేయవద్దని సీబీఐకి కోర్టు సూచించింది. అయితే కేసు ఫైల్స్ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సీబీఐ పేర్కొంది. కేసు ఫైల్స్ ఇస్తే విచారణ జరిపేందుకు తాము రెడీగా ఉన్నామని న్యాయస్థానానికి సీబీఐ వివరించింది.
ఈ కేసులో సుప్రీం కోర్టు న్యాయవాది దవే వాదనలు వినిపించనున్నారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అందువల్ల సోమవారం వరకు తమకు సమయం ఇవ్వాలంటూ ప్రభుత్వం కోరింది. మరోవైపు కేసు సీబీఐకి ఇవ్వడమే సరైందని హైకోర్టులో బీజేపీ వాదించింది.
2014 నుంచి ఇప్పటి వరకు 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని కోర్టుకు బీజేపీ తెలిపింది. బీజేపీ పిటిషన్‌ను కొట్టివేసినా ఎందుకు అప్పీల్ చేశారంటూ ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషన్ కొట్టివేయడానికి కారణాలు సరిగా లేవని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ అంశాలు బయటే చూసుకోవాలని వ్యాఖ్యానించింది. ఈ అంశాలు న్యాయస్థానంలోకి తీసుకురావద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగించారు. కేసులో దర్యాప్తు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలను ఢిల్లీ విభాగానికి సీబీఐ డైరెక్టర్ అప్పగించారు. ఈ క్రమంలో సీబీఐ ఢిల్లీ ఎస్పీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ కు వచ్చింది.
దీంతో సిట్ నుంచి కేసు పత్రాలు ఇవ్వాలని సీఎస్ సీబీఐ లేఖ రాసింది. ఈ క్రమంలో సోమవారం వరకు కేసు ఫైళ్ళ కోసం ఒత్తిడి చేయవద్దని సీబీఐకి హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వ అప్పీలుపై సోమవారం స్పష్టత వచ్చాక ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సీబీఐ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.