జన్వాడ ఫాంహౌస్ వ్యవహారంపై హైకోర్టులో వాడీ వేడి వాదనలు జరిగాయి. రాజకీయ దురుద్దేశంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్జీటీకి ఫిర్యాదు చేశారంటూ మంత్రి కేటీఆర్ తరఫు లాయర్ వాదించారు. నిర్మాణం జరిగిన ఆరు నెలల్లోనే ఎన్జీటీని ఆశ్రయించాలని.. కానీ.. దానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. అసలు.. ఆ ఫాంహౌస్ తో కేటీఆర్ కు సంబంధం లేదన్నారు న్యాయవాది.
ఈ పిటిషన్ లో రాజకీయ కోణాలేవీ లేవని రేవంత్ తరఫు న్యాయవాది వాదించారు. నీటి సంరక్షణ ప్రయోజనాల కోసమే తమ ప్రయత్నం అని వివరించారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకే వెళ్లాలన్నారు. ఇటు.. జన్వాడ ఫాంహౌస్ తనదేనని ఎన్జీటీ కేసులో ప్రతివాదిగా లేనందున నేరుగా హైకోర్టు జోక్యం చేసుకోవాలని ప్రదీప్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అన్ని వైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఏం జరిగిందంటే..?
శంకరపల్లి మండలం జన్వాడ దగ్గర జీవో 111కు విరుద్ధంగా కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించారంటూ 2020లో రేవంత్ రెడ్డి చెన్నై ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్జీటీ 2020లో కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు, నిపుణుల కమిటీ ఏర్పాటుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. తాజాగా ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నై ఎన్జీటీ విచారణను సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో జీవో 111 కిందకు వచ్చే భూముల్లో మంత్రి కేటీఆర్ భూములు కొనుగోలు చేశారని.. ఫాంహౌస్ కట్టారనేది రేవంత్ ఆరోపణ. 2020లోనే ఆధారాలు ఇవిగో అంటూ మీడియా ముఖంగానే రేవంత్ చెప్పారు.
రేవంత్ చెబుతున్నదేంటి..?
జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 301, 302, 312, 313లో తన స్నేహితులైన రాజులు, వారి కుటుంబ సభ్యుల పేరుతో కేటీఆర్ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్థుల ఫాంహౌస్ కట్టారు. సర్వేనెంబర్ 301లో 2 ఎకరాల 2 గుంటలు కేటీఆర్ సతీమణి పేరు మీద భూమి ఉంది. 2019 మార్చి 7న రిజిస్ట్రేషన్ జరిగింది. అందుకు సంబంధించిన రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లలో కేటీఆర్ భార్య ఫొటో కూడా ఉంది. జన్వాడ గ్రామ పరిధిలోని 302, 312, 313 సర్వే నెంబర్లలో మొత్తం 25 ఎకరాల భూమి కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రర్ అయ్యింది.