కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని.. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని వ్యాఖ్యానించింది.
అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని అభిప్రాయపడింది బెంచ్. ఈ సందర్భంగా అభ్యంతరాలు తీసుకుంటున్నామని అడ్వకేట్ జనరల్ వాదించారు. విచారణను ఈనెల 25 కు వాయిదా వేసింది న్యాయస్థానం.
కామారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో తమ భూములు కలిపారంటూ రైతులు నిరసన బాటపట్టారు. ఈ క్రమంలోనే రామేశ్వర్ పల్లెకు చెందిన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ.. పక్కనే ఉన్న పట్టా భూములను ప్రజా అవసరాల కోసం కేటాయించారని అందులో పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. స్థిరాస్థి వ్యాపారుల ప్రయోజనాల కోసమే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారని.. అన్నదాతల అభిప్రాయాలు కూడా తీసుకోవడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రైతుల అభ్యంతరాలపై తమ వైఖరి ఏంటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.