సాంప్రదాయ వినోదమైన కోడిపందాలకు మార్గసుగమం అయ్యింది. పొంగల్ పండుగ సందర్భంగా కోడిపందాలకు అనుమతి కోరుతూ వేసిన పిటిషన్ కి మద్రాసు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.ఈరోడ్, తిరువళ్లూర్ జిల్లాల్లోని రెండు గ్రామాల్లో కోడి పందాలకు మద్రాసు హైకోర్టు నిబంధనలతో కూడిన అనుమతులు జారీ చేసింది.
ఈరోడ్ జిల్లా పెరియ వడమలైపాళయంలో 15 నుంచి 18వ తేది వరకు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జయంతి సందర్భంగా తిరువళ్లూర్‌లో కోడి పందేల నిర్వహణకు అనుమతించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.
వాటిని శనివారం న్యాయమూర్తులు వేలుమణి, హేమలతతో కూడిన ధర్మాసనం విచారించగా, కోడి పందాల్లో డబ్బులు వెచ్చించి జూదమాడడం, కోడిపుంజులను హింసలకు గురి చేయమని హామీ ఇస్తే పందేలకు అనుమతించే అంశం పరిశీలిస్తామని రాష్ట్రప్రభుత్వం తెలియజేసింది. ఇరుతరఫు వాదనలు విన్న ధర్మాసనం, కోడి పందాల నిర్వహణకు పలు నిబంధనలు విధించింది.
కోడిపుంజులను చిత్రహింసలు గురి చేయరాదు, వాటికి మద్యం తాగించ రాదు, వాటి కాళ్లకు కత్తులు కట్టి పోటీలు నిర్వహించకూడదు, పశువైద్యుల పర్యవేక్షణలో పోటీలు సాగాలి… తదితర నిబంధనలతో పందాలకు అనుమతులు జారీ చేసింది. అదే సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ధర్మాసనం పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.