ఎర్రమంజిల్‌పై హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు ఎదురుదెబ్బ
అసెంబ్లీ భవనాన్ని నిర్మించొద్దన్న హైకోర్టు
హైదరాబాద్: ఎర్రమంజిల్ కేసులో తెలంగాణ సర్కారుకు చుక్కెదురైంది. ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను పడగొట్టి దాని స్థానంలో కొత్తగా శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలను నిర్మించాలని ఈ ఏడాది జూన్ 18న రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రిమండలి నిర్ణయాన్ని రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష చేసే అధికారం పరిమితమే అయినప్పటికీ చట్టాలను విస్మరించి నిర్ణయం తీసుకుంటే అది విధాన నిర్ణయమైనా జోక్యం చేసుకుంటామని స్పష్టంచేసింది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకుని న్యాయసమీక్ష చేయడం ద్వారా సరి చేస్తాయని తేల్చిచెప్పింది. ఎర్రమంజిల్ వ్యవహారంలో చట్టంలోని ప్రాథమిక అంశాలను విస్మరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ సర్కారు చట్టాలను ఎక్కడ ఉల్లంఘించిందో విపులీకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం తుది ఆదేశాలు జారీచేసింది.