వేములవాడకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా? పౌరసత్వ వివాదం కేసులో ఎమ్మెల్యే చెన్నమనేని మెడకు ఉచ్చు బిగిసినట్టేనా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. చెన్నమనేని పౌరసత్వ వివాదం కేసులో తాజాగా హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు సిద్ధం కావాలని కామెంట్ చేసింది. అయితే చెన్నమనేనిని సంప్రదించి పూర్తి వాదనలు వినిపిస్తానిని ఆయన తరపు న్యాయవాది చెప్పడంతో తదుపరి విచారణను ఆగస్టు 24 కు వాయిదా వేసింది. దీంతో ఆరోజు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
చెన్నమనేని వ్యవహారంపై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికరమైన వాదనలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సొలిసెటర్ జనరల్ రాజేశ్వర్ రావు, పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపున న్యాయవాది రవికిరణ్ రావు తమ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా రవి కిరణ్ బుక్ లెట్ రూపంలో కోర్టుకు నివేదిక సమర్పించారు. 2019లో బెర్లిన్‌లో ఇండియన్ ఎంబసీ ద్వారా చెన్నమనేని OCI కార్డ్ తీసుకున్నారని ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. OCI దరఖాస్తు ఫామ్ -10 కాలమ్‌లో చెన్నమనేని తన జాతీయతను జర్మనీగా ప్రస్తావించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి OCI కార్డ్ మీద ఇండియాకు వస్తూ.. జర్మనీ పాస్‌పోర్ట్ మీద చెన్నమనేని జర్మనీకి వెళ్తున్నరాని కోర్టుకు తెలిపారు.
2009లో చెన్నమనేని భారత పౌరసత్వం పొందినప్పుడు.. జర్మనీ పాస్ పోర్ట్ కాలపరిమితి 2013 వరకే ఉందని రవికిరణ్ రావు కోర్టుకు తెలిపారు. చెన్నమనేని భారతీయుడు అయితే ..జర్మనీ పాస్ పోర్ట్‌ను 2023 వరకు ఎలా రెన్యూవల్ చేసుకోగలరన్న సందేహాన్ని కోర్టు ముందుంచారు. ఇండియన్ అయితే.. ఇండియా పాస్ పోర్ట్‌పై ప్రయాణం చేయాలి కానీ జర్మనీ పాస్ పోర్ట్‌పై ప్రయాణాలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు
రవికిరణ్ వాదనలు విన్న అనంతరం.. OCI కార్డ్‌లో తన నేషనాలిటిని జర్మనీ అని ఎలా రాసారని చెన్నమనేని ప్రశ్నించింది హైకోర్టు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు సిద్దం కావాలని సూచించింది. అయితే చెన్నమనేని తరపు న్యాయవాది జోక్యంతో తదుపరి విచారణను ఆగస్టు 24 కు వాయిదా వేసింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.