-టెండర్లలో అవినీతిపై పిటిషన్లు
– తుది టెండర్లు ఖరారు చేయొద్దంటూ ఆదేశాలు
మన ఊరు- మన బడి టెండర్లకు సంబంధించి అవినీతి జరుగుతోందని తొలివెలుగు వరుస కథనాలు ఇస్తోంది. ఏలినవారి అస్మదీయులకే కాంట్రాక్టు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆధారాలతో సహా తొలివెలుగు కథనాలు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మన ఊరు-మన బడి విషయంలో రాష్ట్ర సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. తుది టెండర్లను ఖరారు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీచేసింది. అంతేగాకుండా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మన ఊరు-మన బడికి సంబంధించి రూ. 1539 కోట్లకు పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కలిసి టెండర్లకు ఆహ్వానించాయి. ఈ మొత్తాన్ని 26,065 బడుల కోసం వెచ్చించటానికి టెండర్లు రూపొందించారు. రూ. 1539 కోట్లలో రూ. 820 కోట్లు పెయింట్స్ కోసం, రూ. 195 కోట్లు ఫర్నీచర్, రూ. 360 కోట్లు డ్యూయల్ డెస్క్ లు, రూ. 164 కోట్లు గ్రీన్ చాక్ బోర్డ్ కోసం… ఇలా ఈ మొత్తాన్ని విభజించారు. అయితే టెండర్ 43, 44లను కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్రీయ భండార్, జెనిత్ మెటా ప్టాస్ట్, వీ3 ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థలు సంయుక్తంగా రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశాయి.
టెండర్ వేయటానికి అవసరమైన అన్ని అర్హతలు తమకు ఉన్నప్పటికీ, బిడ్డింగ్ విషయంలో తమ కంపెనీలను అనర్హుల జాబితాలో చేర్చారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ తన వాదనలు వినిపించారు. వీటిని విచారించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వాదనలు నమోదు చేసుకుని విచారించింది. పిటిషనర్ వాదన ప్రకారం, టెండర్లలో పాల్గొనే సంస్థ గత ఐదేళ్లలో ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 97.5 కోట్ల విలువైన పనులు చేసి ఉండాలని నిబంధనల్లో ఉందనీ.. అయితే తమ జాయింట్ వెంచర్ నాలుగేళ్ల పాటు రూ. 200 కోట్లకు పైగానే పనులు చేశామని కోర్టుకు వివరించారు. వారు అడిగిన దానికంటే ఎక్కువే అనుభవమున్న తమ వెంచర్ ను అనుభవం లేదంటూ పక్కన బెట్టడం చట్ట విరుద్ధమంటూ అవినాశ్ వాదించారు. అంతేగాకుండా తమకంటే తక్కువ అనుభవం ఉన్న ఎలిగాంట్ మెథోడెక్స్ ను అర్హత ఉన్న బిల్డర్ గా పరిగణించటం చట్ట విరుద్ధం కాదా అంటూ ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం తరఫున సంజీవ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. అర్హతలు ఉన్నప్పటికీ బిడ్డింగ్ సమయంలో అందుకు సంబంధించిన ధృవపత్రాలు సమర్పించారా లేదా అనేది కూడా పరిగణించాల్సిన విషయమంటూ ధర్మాసనానికి నివేదించారు.
ఇరువురి వాదనలు విన్న తర్వాత ధర్మాసనం పాఠశాల విద్యాశాఖ, టీఎస్ఈ డబ్ల్యూ ఐడీసీ, కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్, ఎలిగాంట్ మెథోడెక్స్ లకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 11కు వాయిదా వేస్తూ.. తుది టెండర్లను ఖరారు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు.. గ్రీన్ చాక్ బోర్డ్ ల కొనుగోలుకు సంబంధించిన టెండర్ నెం.45 ను సవాల్ చేస్తూ జస్టిస్ కే. లక్ష్మణ్ ధర్మాసనం ముందు దాఖలైన పిటిషన్ పై బుధవార విచారణకు చేపట్టింది. తదుపరి ఆదేశాలు జారీచేసేంత దాకా తుది టెండర్లు ఖరారు చేయవద్దంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పెయింట్స్ సరఫరాకు సంబంధించిన టెండర్ నెం. 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తదుపరి విచారణ జరగాల్సి ఉంది.