తెలంగాణ సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం బంజారాహిల్స్ లో అత్యంత ఖరీదైన 4,935 గజాల భూమిని టీఆర్‌ఎస్ జిల్లా ఆఫీస్ కి కేటాయించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.
నిజానికి ఏ పార్టీకి జిల్లా కార్యాలయానికి గతంలో భూములు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ.. ప్రభుత్వం తమదేనని అనుకున్నారో ఏమో ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేసుకున్నారని అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్ రాజ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.
అత్యంత ఖరీదైన భూమిని గజానికి రూ.100 చొప్పున కేటాయించారని పిటిషన్ లో వివరించారు మహేశ్వర్ రాజ్. అలాగే జిల్లాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాలకు భూకేటాయింపునూ సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే.. సీఎస్, సీసీఎల్‌ఏ, రెవెన్యూ సీఎస్, హైదరాబాద్ కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ప్రస్తుతం ఉన్న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని తలదన్నేలా జిల్లా ఆఫీస్ ను నిర్మించాలని కేసీఆర్ భావించారని ప్రతిపక్షాలు చెబుతూ వస్తున్నాయి. దీనికి వాస్తు దోషమే అసలు కారణంగా అనేక అనుమానాలను తెరపైకి తెచ్చాయి.