జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సొసైటీ వ్యవహారాల పర్యవేక్షణ, నియంత్రణకు స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ కమ్ కమిషనర్ ను ఆదేశించింది. కార్యదర్శి మురళీ ముకుంద్ స్పెషల్ ఆఫీసర్ నియామకం కోరుతూ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే సెక్రెటరీ అధికారాలను తొలగిస్తూ సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ ఈనెల 12న జారీ చేసిన నోటీసును సస్పెండ్ చేసింది హైకోర్టు.
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీగా ఉన్న తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ప్రెసిడెంట్ బొల్లినేని రవీంద్రనాథ్, ఇతర పాలకవర్గ సభ్యులపై ఫిర్యాదు చేస్తూ మురళీ ముకుంద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి హైకోర్టు అధ్యక్షుడికి నోటీసులు జారీచేసింది. మురళీ పిటిషన్ ను పరిశీలించి ప్రతివాదులైన సహకారశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సహకార సొసైటీల రిజిస్ట్రార్, జూబ్లీహిల్స్ సొసైటీ ప్రెసిడెంట్ బొల్లినేని రవీంద్రనాథ్ కు నోటీసులు ఇచ్చింది. తన హక్కులకు అధ్యక్షుడితోపాటు ఇతర మేనేజింగ్ కమిటీ సభ్యులు భంగం కలిగిస్తున్నారని.. మీటింగ్స్ కు కూడా రానివ్వడం లేదని… తన బాధ్యతలను నిర్వర్తించనివ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు మురళీ ముకుంద్. ఆయన అభ్యర్థన మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.
జూబ్లీహిల్స్ సొసైటీలో గత 15 ఏళ్లుగా జరిగిన అక్రమాలపై తొలివెలుగు పలు కథనాలు రాసింది. గత దర్యాప్తులు.. కొత్త కమిటీ వ్యవహారాలు.. పాత కమిటీ హయాంలో ఫైల్స్ మిస్సింగ్ సహా పలు విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే కొత్త కమిటీలో విభేదాలు భగ్గుమన్నాయి. సొసైటీ సెక్రెటరీగా ఉన్న తన హక్కులకు ప్రెసిడెంట్, ఇతర మేనేజింగ్ కమిటీ సభ్యులు భంగం కలిగిస్తున్నారని మురళీ ఆరోపించారు. ఒకే ప్యానల్ నుంచి గెలిచిన వారు పాత కమిటీ అక్రమాలతో పాటు మిగితా వ్యవహారాలు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఫైల్స్ ఫోరెన్సిక్ అడిటింగ్ కావాలని పట్టుబట్టడం… దీనిపై అభ్యంతరాలు రావడంతో ఇష్యూ కోర్టుకు చేరింది.
బై లా ప్రకారం సెక్రెటరీ తప్పులు చేస్తేనే ఆయన అధికారాలను కట్టడి చేయాలి. ఎలాంటి తప్పులు చూపించకుండానే పవర్స్ ని కట్ చేయడంతో కొత్త కమిటీ వ్యవహారం వివాదాస్పదమైంది. వేల కోట్ల రూపాయల అస్తులు ఉన్న జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలకు తావు లేకుండా ఉండాలంటే ప్రభుత్వమే టేకోవర్ చేయాలనే వాదన సభ్యుల్లో బలంగా వినిపిస్తోంది. విజిలెన్స్, సీఐడీ, ఏసీబీలతో దర్యాప్తు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
Advertisements
ఈ నేపథ్యంలోనే హైకోర్టు.. కమిటీ విభేదాలు సభ్యులకు నష్టం చేకూరవద్దని సొసైటీకి ప్రత్యేక పాలన అధికారిని నియమించింది. మురళీ ముకుంద్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపి మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.