రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ బలవన్మరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతని ఆత్మహత్యకు సంబంధించి న్యాయవాది కె.కృష్ణయ్య వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అంతేకాదు, మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది.
పోలీసుల వేధింపులు తాళలేక సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న.. మంత్రి పువ్వాడ అజయ్‌తో ఖమ్మం టీఆర్ఎస్ నేత ప్రసన్నకృష్ణ, కేంద్ర, రాష్ట్ర హోం శాఖలు, ఖమ్మం సీపీ, సీఐ సర్వయ్య, త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో, సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది.
అయితే సాయి గణేశ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టు దృష్టికి తెచ్చారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ ధర్మాసనానికి విన్నవించారు. దీంతో రెండు వారాల్లో ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది ధర్మాసనం. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
కాగా, కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారంటూ ఈ నెల 14న సాయిగణేశ్ పోలీస్‌స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బీజేపీ కార్యకర్తలు వెంటనే ఆయనను హాస్పిటల్ లో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణానికి ముందు మీడియాతో మాట్లాడిన సాయి గణేశ్ తనను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు గురి చేసినట్లు చెప్పారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు తనపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని చెప్పాడు.