బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో నిరాశే మిగిలింది. సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్థానం. ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు, వీడియో రికార్డులు సమర్పించేలా ఆదేశాలిచ్చేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే.. పూర్తిస్థాయి విచారణ కోసం అసెంబ్లీ కార్యదర్శికి మరోసారి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావును సస్పెండ్ చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అడ్డుపడ్డారని తలసాని శ్రీనివాస్ సస్పెండ్ తీర్మానం చేశారు. దానికి సభ ఆమోదం తెలిపగా.. ఈ సెషన్ పూర్తయ్యే వరకు బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్.
తమను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. సస్పెన్షన్ కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. అలాగే తీర్మానంతో పాటు సమావేశాల వీడియో రికార్డింగులను తెప్పించి తమకూ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.
బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.