కెకె, తొలివెలుగు ప్రతినిధివిద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) మళ్ళీ సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కొత్త టారిఫ్ విధానం ప్రకారం వెంటనే తాత్కాలిక చెల్లింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ధరల వ్యవహారాన్ని ఆరు నెలల్లో పరిష్కరించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు చర్యతో పలు విద్యుత్ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి.

గుంటూరు: పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష విషయంలో ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు.. మరోసారి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 63పై ఇవాళ విచారణ చేపట్టి అన్ని అంశాలను పరిశీలించి కొట్టేసింది. అంతేకాదు.. పీపీఏలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టిపారేసింది. ఇప్పటివరకూ నిర్ణయించిన ధర ప్రకారం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్‌లో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఏపీ ఈఆర్సీకి వెళ్లాలని ప్రభుత్వానికి, పీపీఏలకు హైకోర్టు సూచించింది. ఆరు నెలల్లోపు వివాదాన్ని పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివిధ కారణాలతో విద్యుత్‌ను తీసుకోవడం నిలిపివేసిన సంస్థల నుంచి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా మధ్యంతర చెల్లింపు కింద యూనిట్‌కు రూ.2. 43 నుంచి రూ. 2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను అంగీకరించిన కోర్టు పీపీఏలపై పునఃసమీక్షకు వెళ్తున్నామని ప్రభుత్వమే చెప్తున్న దృష్ట్యా గతంలో జారీచేసిన జీవోను పక్కనపెడుతున్నామని పేర్కొంది.