తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు దర్యాప్తును సీబీఐ, ఈడీ, ఎన్ సీబీకి అప్పగించాలన్న రేవంత్ రెడ్డి పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విదేశాల నుండి డ్రగ్స్ సరఫరా అవుతుండటం, భారీగా డబ్బు చేతులు మారిన నేపథ్యంలో లోతైన దర్యాప్తు కోసం కేంద్ర సంస్థలకు అప్పగించాలని కోరారు.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరుతూ వస్తున్న ప్రభుత్వం, మరోసారి వారం రోజుల గడువు ఇవ్వాలని కోరింది. దీనిపై రేవంత్ రెడ్డి తరుపు లాయర్ రచనా రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడేళ్ళుగా కౌంటర్ దాఖలు చేయటం లేదన్నారు. దీంతో ఇదే చివరి అవకాశం అని, వారం రోజుల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ… తదుపరి విచారణను డిసెంబర్ 17కు వాయిదా వేసింది.
ఇదే కేసులో హైకోర్టుకు ఈడీ కీలక సమాచారం ఇచ్చింది. కేసును విచారించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు తెలిపింది. తమకున్న సమాచారం ప్రకారం 12 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని, వాటికి సంబంధించిన సమాచారాన్ని తాము మూడు సంవత్సరాలుగా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని ఈడీ కోర్టు దృష్టికి తెచ్చింది. కేసుకు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్ కాపీలతో పాటు ఇతర సమాచారం ఇస్తే తాము విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఈడీ కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.