నాలుగు రాజధానులు, రెండు హైకోర్టు బెంచ్‌లు అంటూ లేనిపోని ఆశలు కల్పించడంతో ఇప్పుడదే జగన్ సర్కార్ మెడను చుట్టుకుంటోంది. అమరావతిలో హైకోర్టు వుండాలని, కర్నూలు తరలిస్తే ఊరుకునేది లేదని ఐదు జిల్లాల న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరోపక్క విశాఖ, రాయలసీమ ప్రాంతాలలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ అక్కడ రోజురోజుకూ బలపడుతోంది.
గుంటూరు: అమరావతిలో హైకోర్టు ఉండాలని, కర్నూలు తరలించ కూడదని గత కొన్ని రోజులుగా ఐదు జిల్లాల న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం ఉధృతరూపం దాల్చుతోంది. గుంటూరు జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు రిలే దీక్షలు చేస్తున్నారు. పాలకుల అస్పష్టమైన విధానం వలన ఏపీలో న్యాయవాదులు ప్రాంతాలవారీగా విడిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని ఆయావర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే అమరావతి ప్రాంతంలో తాత్కాలిక హైకోర్ట్ ఏర్పాటుచేశారు. ప్రస్తుతానికి దాన్ని తాత్కాలికంగా వినియోగించుకుని శాశ్వత హైకోర్టు నిర్మాణం జరిగాక జిల్లా కోర్టుగా మార్చుకోవచ్చునని భావించారు. ఇంతలో ప్రభుత్వం మారడం, అమరావతి రాజధానిగా వుండబోదంటూ సంకేతాలు ఇస్తుండటం, మరోపక్క సీయం జగన్ ఢిల్లీలో హోంమంత్రి అమిత్‌షాను కలిసి కర్నూలు, విశాఖల్లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ముందుంచడం.. ఈ పరిణామాలతో హైకోర్టు అసలు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే అంశంపై వివాదం ముసురుకుంది. కర్నూలులో బెంచ్ కాకుండా శాశ్వత హైకోర్టునే ఏర్పాటు చేస్తారన్న సమాచారంతో అమరావతి కేంద్రంగా పనిచేస్తున్న న్యాయవాదులు ఆందోళనకు గురయ్యారు. హైకోర్టు ఎక్కడైనా రాజధాని ప్రాంతంలోనే ఉంటుందని, అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వేరే ప్రాంతాలకు తరలిస్తే అది లేనిపోని ఉద్రిక్తతలకు తావిస్తుందని వారంటున్నారు. అమరావతిలో హైకోర్టును కదల్చాల్సిన అవసరమే లేదని న్యాయవాదులు ఉద్యమిస్తున్నారు. అసలే తెలుగువారు ఇప్పటికే రెండు రాష్ట్రాలుగా విడిపోయి వుంటున్నారని, ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో లేనిపోని ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం వల్ల అభివృద్ధి మొత్తం కుంటుపడుతుందని వారంటున్నారు. ఇప్పటికే అమరావతిలో రాజధాని వుంటుందా వుండదా అనే విషయమై ప్రభుత్వం ఎటూ తేల్చకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. దీనితోపాటు ఏపీలో నాలుగు రాజధానులు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే హైకోర్టు విషయంలో ప్రాంతీయ విభేదాలు తలెత్తితే పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళనతో ఆయావర్గాలు వున్నాయి. ప్రభుత్వం స్పందించి తక్షణం ఒక స్పష్టమైన ప్రకటన చేయకుంటే ముందు ముందు హైకోర్టు రాజధాని విషయాలలో తీవ్రంగా ఉద్యమాలు తలెత్తుతాయని అంటున్నారు.