తెలంగాణాలో న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ
జస్టిస్ సంజయ్‌కుమార్ బదిలీకి నిరసన
హైదరాబాద్: తెలంగాణాలో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోర్టు విధుల బహిష్కరణకు తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది.హైకోర్టుతో పాటు తెలంగాణలోని అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించాలని అన్ని బార్ అసోసియేషన్లకు అసోసియేషన్ పిలుపునిచ్చింది. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం సీనియారిటీలో ద్వితీయ స్థానంలో ఉన్న జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ అప్రజాస్వామిక బదిలీ పట్ల బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు పి అండ్ హెచ్ జడ్జిగా పీవీ సంజయ్‌కుమర్ 12వ స్థానంలో ఉన్నారని అసోసియేషన్ వివరించింది. జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ ఏ రాష్ట్రానికైనా హైకోర్టు చీఫ్ జడ్జిగా పదోన్నతిపై నియమితులు కావడానికి అర్హత కలిగి ఉన్న వారని బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
జస్టిస్ సంజయ్‌కుమార్ బదిలీ వల్ల తెలంగాణ అంతటికీ అన్యాయం జరిగినట్టయిందని, ఈ బదిలీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హైకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది. న్యాయ వ్యవస్థ పరిరక్షణలో భాగంగా ఎన్ సీఎల్ టీ బార్ అసోసియేషన్ కూడా కోర్టు, ట్రిబ్యునల్ విధుల్ని రేపటి నుంచి శుక్రవారం వరకు బహిష్కరించాలని తీర్మానం చేసినట్టు అసోసియేషన్ తెలిపింది.
ఎన్. సి.ఎల్.టి.బార్ ఆసోసియేషన్ హైద్రాబాద్ ఎన్. సి.ఎల్.టి. బెంచ్ న్యాయ, టెక్నికల్ మెంబర్లను కలిసి న్యాయవాదుల విధుల బహిష్కరణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని అభ్యర్ధించనున్నామని ఎన్. సి.ఎల్.టి. హైద్రాబాద్ బెంచ్ జనరల్ సెక్రెటరీ ఎన్. హరినాథ్ తెలియజేశారు.