జూనియర్ కాలేజీల అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలు పాటించని కాలేజీలు మూసివేశామని ఇంటర్ బోర్డు హైకోర్టుకు తెలిపింది. 20 నారాయణ, 10 శ్రీచైతన్య సహా 40 కాలేజీలు మూసివేశామని నివేదిక ఇచ్చింది.
కాలేజీలపై చర్యలపై 3 వారాల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశిస్తూ… అగ్నిమాపక శాఖ నిబంధనలపై శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి కాలేజీల పిటిషన్లపై కూడా విచారణ చేపట్టింది. చట్టం రాకముందు నిర్మించిన భవనాలకు కూడా అనుమతివ్వడం లేదని కాలేజీల యాజమాన్యాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. ప్రభుత్వం అకస్మాత్తుగా నిబంధనలు అమలు చేయాలని చెబుతోందని, ప్రత్యామ్నాయ నిబంధనలు పరిశీలించాలని యాజమాన్యాలు కోర్టును కోరాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఇప్పుడే నిద్ర లేచిందన్న ధర్మాసనం, కాలేజీలు అగ్నిమాపక నిబంధనలు పాటించాలసిందేనన్న స్పష్టం చేసింది.
విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టవద్దని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, నిబంధనలకు అనుగుణంగా లేని భవనాల్లో కాలేజీలు ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్నించింది. కొన్ని కాలేజీలు కేవలం లాభాల కోసం నడుపుతున్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కాలేజీల వాదన ఏ మాత్రం సహేతుకంగా లేదని తుది తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.