ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ స్టేట్ ఇంకా సెంట్రల్ మధ్య రోజుకో ట్విస్ట్ తీసుకుంటుంది. తాజాగా సీజే అనుమతి తీసుకురండి అని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇక ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును 3 వారాలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించాలా.. వద్దా.. అనే దానిపై ప్రధాన న్యాయమూర్తి వద్ద అనుమతి తీసుకొని రావాలని జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా.. అని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ను కోర్టు ప్రశ్నించగా సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తెలిపారు.
అయితే కేసు ఫైళ్లను అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తోందని అడ్వొకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని హైకోర్టు ప్రశ్నించింది. అప్పీల్ కు వెళ్లేందుకు వారం రోజుల సమయం కావాలని ఏజీ కోరారు.
దీంతో పిటీషన్ విచారణకు సీజే అనుమతి తీసుకొని రావాలంటూ ఏజీకి సూచించింది. రేపు ఉదయం సీజే అనుమతి కోరుతామని ఏజీ తెలుపడంతో తదుపరి విచారణను సింగిల్ బెంచ్ రేపటికి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.