తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లలో సీసీటీవీ ఫుటేజీలపై నివేదిక సమర్పించాలంటూ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత 9, 10 నెలలుగా సీసీటీవీ ఫుటేజీని భద్రపరచడంపై హైకోర్టు చెబుతున్నా, కనీసం 6 నెలలైనా ఫుటేజీని భద్రపరచాలని సుప్రీం కోర్టు ఆదేశించినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పలు కేసుల్లో సీసీ కెమెరాలే పని చేయడం లేదని చెబుతున్నారని కోర్టు పేర్కొంది.
గత ఏడాది నాగర్ కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తిని ఎస్ఐ కొట్టారన్న ఆరోపణలతో సీసీటీవీ ఫుటేజీ వివరాలను సమర్పించాలని ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. తిమ్మాజీ పేటకు చెందిన సీహెచ్ మాధవులు అనే వ్యక్తిని ఎస్ఐ కొట్టాడంతో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లగా.. మెడికో లీగల్ కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీనిపై బాధితుడు ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు.
వినతి పత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించినా చర్యలు తీసుకోకపోవడంతో ఎస్పీ మనోహర్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై కోర్టు విచారణ చేపట్టి ఉత్తర్వులు వెలువరించింది. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ లో పిటిషనర్ కు నోటీసు ఇవ్వడానికి ప్రయత్నించామని, ఎస్పీ బిజీగా ఉండడంతో డీఎస్పీకి.. ఆయన సీఐకి.. ఇలా విచారణ బాధ్యతను సహ ఉద్యోగికి అప్పగించడాన్ని చూస్తే.. బాధితుడికి న్యాయం చేయాలన్న ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం పేర్కొంది హైకోర్టు.
బాధితుడు స్టేషన్ కు వచ్చినప్పుడు ఎస్ఐ కొట్టాడని చెబుతున్నాడు. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజీ ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదంది. ఈ వ్యవహారాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించి సీసీ కెమెరాల ఫుటేజీలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 10వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అలాగే ఆ తేదీ నాటికి సీసీ కెమెరాల ఫుటేజీల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని డీజీపీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.