బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టు లో ఊరట లభించింది. కరీంనగర్ జైలులో ఉన్న బండి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపింది న్యాయస్థానం. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. జ్యుడీషియల్ రిమాండ్ పై స్టే విధించింది. వ్యక్తిగత పూచీకత్తు రూ.40వేలపై సంజయ్ ను రిలీజ్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
317 జీవోను సవరించాలని కరీంనగర్ లో జాగరణ దీక్షకు దిగిన సంజయ్ ఈనెల 2న అరెస్ట్ అయ్యారు. పలు కేసులు నమోదు చేసి 3న స్థానిక కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఆ సమయంలో బెయిల్ పిటిషన్ కు అప్లై చేసినా కోర్టు తిరస్కరించింది.
4న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బండి. బెయిల్ ఇప్పించాలని తనపై పెట్టిన కేసులను కొట్టి వేయాలంటూ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ప్రజాప్రతినిధుల సంబంధించిన కేసులు విచారణ జరిపే కోర్టుకు వెళ్లాలని తెలిపింది. ఇదే పిటిషన్ ను సంబంధిత బెంచ్ కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్ ను న్యాయమూర్తి ఆదేశించారు. బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. బండిని విడుదల చేయాలని ఆదేశించింది.