తెలంగాణలో కరోనా పరిస్థితిపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినతరం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరుపున ఏజీ తమ వాదనలు వినిపించారు. హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఇంటింటి సర్వే చేస్తున్నామని.. జ్వరం ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని నివేదికలో తెలిపారు.
మూడు రోజుల్లోనే లక్ష 78 వేల మంది జ్వర బాధితులను గుర్తించామని అన్నారు. వారికి మెడికల్ కిట్లు కూడా అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని నివేదికలో వివరించారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని.. ఒక్క జిల్లాలో కూడా 10 శాతం మించలేదని అన్నారు. నైట్ కర్ఫ్యూ అమలు చేసే పరిస్థితి లేదని.. 10 కంటే ఎక్కువ శాతం పాజిటివిటీ రేటు ఉంటే రాత్రి కర్ఫ్యూ విధిస్తారని కోర్టుకి వివరించారు. కరోనాను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
3 రోజుల్లోనే 1.70 లక్షల మందికి జ్వర బాధితులను గుర్తించారంటే.. తెలంగాణలో కరోనా తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సర్కార్ ఇస్తున్న కరోనా కిట్లో పిల్లలకు అవసరమైన మందులు లేవని అన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆరోపించారు.
ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. జీహెచ్ఎంసీ, పోలీసులు కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. ప్రజలు మాస్కుల వాడటంలేదని, సామాజిక దూరం పాటించడం లేదని పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు డీహెచ్ హాజరు కావాలని ఆదేశించింది.