హైకోర్టు హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు షాక్ ఇచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్లో ఆంక్షలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే గతంలో ఇచ్చిన ఆదేశాలపై హైదరాబాద్ లోని పలు పబ్ నిర్వాహకులు వెకెట్ పిటిషన్ వేయగా వారికి హైకోర్టు ధర్మాసనం ఈ విధంగా ఝలక్ ఇచ్చింది.
హైదరాబాద్ లోని టాట్, జూబ్లీ 800, ఫర్టి కేఫ్, అమ్నిషియా, హైలైఫ్, డైలీడోస్ లతో పాటు మరో నాలుగు పబ్ లకు ఈమేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి పది గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ పెట్టొద్దని కోర్టు ఈ ఆదేశాల ద్వారా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. దీంతో గతంలో ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు సమర్థించింది.
అయితే కోర్టు ఆదేశాల కంటే ముందు పబ్ లలో అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సౌండ్ సిస్టమ్ పెట్టడం, న్యూసెన్స్ చేయడం పట్ల పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు కోర్టు రాత్రి పది దాటిన తరువాత ఎలాంటి సౌండ్ సిస్టమ్ వాడడానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపై పబ్ నిర్వాహకులు వెకెట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ తీర్పును ఇచ్చింది.