బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోబోదంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ను సవాలు చేస్తూ రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనపై విచారణ జరిపిన హైకోర్టు.. అసెంబ్లీ కార్యదర్శికి ప్రత్యక్షంగా నోటీసులు ఇవ్వాలని జ్యుడిషీయల్ రిజిస్ట్రార్ ను.. అవి చేరేలా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోకపోవడంపై మండిపడింది.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజున మంత్రి హరీష్ రావు ప్రసంగానికి అడ్డుపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. దీనిని సవాల్ చేస్తూ పిటిషన్ వేయగా.. సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. ఎంతో ప్రయత్నించినా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేయలేకపోయామని హైకోర్టు రిజిస్ట్రీకి తెలిపారు ఎమ్మెల్యేలు. సస్పెన్షన్ ఎత్తివేసి సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్థానం.
తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేయడంతో ఎమ్మెల్యేలు మరోసారి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సస్పెన్షన్ వ్యవహారంపై అప్పీల్ చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం లేదని వివరించారు. ఈ నేపథ్యంలో జ్యుడిషీయల్ రిజిస్ట్రార్ ను ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.