ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొప్పుల ఈశ్వర్ ఎన్నిక సరికాదని.. ధర్మపురి స్థానం నుంచి ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
ధర్మపురి నియోజకవర్గం నుంచి 2018లో ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్.. కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. ఈవీఎంల వీవీ ప్యాట్ లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలుపొందినట్లు ప్రకటించారని, అది ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని 2019లో లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ పిటిషన్‌ను తిరస్కరించాలని.. న్యాయస్థానాన్ని కొప్పుల ఈశ్వర్ కోరారు. పిటిషన్లో సరైన కారణాలు చూపలేదని కొప్పుల ఆరోపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు… కొప్పుల ఈశ్వర్ పిటిషన్ కొట్టివేసింది. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ పిటిషన్పై త్వరలోనే హైకోర్టు విచారణ చేపట్టనుంది.
కాగా, ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ అన్యాయంగా గెలిచారని లక్ష్మణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ధర్మపురి అసెంబ్లీ ఓట్ల రీకౌంటింగ్ కోసం కొప్పుల ఈశ్వర్ పిటిషన్ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. మూడేళ్లుగా తాను న్యాయ పోరాటం చేస్తున్నానని.. జూలై 3 లోగా న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తనకు ఏదైనా జరిగితే.. సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.