బహుశా తాడేపల్లిలో ఒక భవనంలో.. టీవీలు బద్ధలయి ఉంటాయి.. టేబుల్ మీద వస్తువులు గాల్లోకి లేచి ఉంటాయి. అలాంటి షాక్ తగిలింది మరి. అది ఎవరిల్లు.. ఎవరి టీవీ అనేది మీరు ఊహించుకోండి.. మేం చెప్పలేం. ఉత్కంఠ మరో రెండువారాల పాటు పొడిగించబడింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి గాని.. కనీసం క్యాంపు కార్యాలయాలను తరలించడానికి గాని.. జగన్ సర్కార్ కు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆగస్టు 16న శంకుస్థాపన అని.. ప్రధానమంత్రికి ఆహ్వానం అంటూ చేసిన హడావుడి అంతా తుడిచిపెట్టుకుపోయింది. హైకోర్టు స్టే ఆర్డర్ ని.. ఆగస్టు 27 వరకు పొడిగించింది. ప్రభుత్వ తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది పదే పదే కోరినప్పటికి.. హైకోర్టు ధర్మాసనం స్టే ఎత్తివేతకు నిరాకరించింది.
దీంతో వైసీపీ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది.. అమరావతి రైతులకు కాస్త ఊపిరి అందినట్లయింది. అటు సుప్రీంకోర్టులోను.. స్టే ఆర్డర్ ఎత్తివేయాలంటూ వేసిన రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ఇంకా విచారణకే రాలేదు. ఎమర్జెన్సీగా టేకప్ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరినా.. సుప్రీంకోర్టు కన్సిడర్ చేయలేదు. దీంతో ఆ ఆశలు కూడా ఆవిరి అయినట్లే కనపడుతున్నాయి. అమరావతిపై యధాతథ స్ధితి అంటే.. ఏ ఆఫీసు కూడా తరలించే పరిస్ధితి ఉండదు. అయితే అసలు దసరాకు రాజదాని విశాఖకు తరలించాలనుకున్న ప్రభుత్వం.. చట్టసభలలోను, గవర్నర్ దగ్గర మేనేజ్ చేసి మరీ బిల్లులు ఆమోదించుకోవడం.. పరోక్షంగా బిజెపి నుంచి సపోర్ట్ లభించడంతో… జగన్ స్పీడు పెంచారు.
అసలు దసరా దాకా ఎందుకు.. ఆగస్టు 15 ముహూర్తం పెడదామన్నారు.. ఆ తర్వాత హైకోర్టు స్టే ఆర్డర్ 14 వరకు పెట్టడంతో.. ఆగస్టు 16న అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ స్టే ఆర్డర్ రావడంతో.. ఇక దసరాకే ఫిక్స్ అయ్యే ఛాన్సుంది. కాని అధికారులకు మాత్రం మౌఖిక ఆదేశాలున్నాయి.. ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని వారికి స్పష్టంగా చెప్పారు. అందుకే ఎప్పుడైనా సరే. . విశాఖ నుంచి పాలన చేయడానికి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. విశాఖలో పోలీసు, రెవెన్యూ అధికారులను సైతం మార్చారు. అంతా రెడీ చేసుకుని.. పైగా అమరావతిలో కట్టడాలను పూర్తి చేస్తామనే నాటకం కూడా జాగ్రత్తగా ఆడారు.. అది కూడా కోర్టు విచారణకు ఒక రోజు ముందు. అయినా గాని హైకోర్టులో చుక్కెదురైంది. న్యాయస్ధానాలొక్కటే ఏకైక మార్గంగా మిగిలిన నేపథ్యంలో.. హైకోర్టు ఆదేశాలు అమరావతి రైతులకు ఊరటనిచ్చాయి.