కాంగ్రెస్ నేతలకు నిరాశే ఎదురైంది. ఓయూలో విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖికి అనుమతి నిరాకరించింది హైకోర్టు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. యూనివర్సిటీ క్యాంపస్ ను రాజకీయ వేదికగా వినియోగించరాదని తెలిపింది. గతంలో సీఎం జన్మదిన వేడుకలు.. బీజేపీ మాక్ అసెంబ్లీ, జార్జిరెడ్డి జయంతి జరిగాయని పిటిషనర్ల వాదనపైనా క్లారిటీ ఇచ్చింది.
గతంలో అనుమతించారన్న కారణంగా రాహుల్ ముఖాముఖికి అనుమతివ్వలేమని తెలిపింది హైకోర్టు. ఓయూ పాలక మండలి తీర్మానానికి విరుద్ధంగా చెప్పలేమని స్పష్టం చేసింది. సమానత్వ హక్కు పాజిటివ్ అంశాలకే.. నెగెటివ్ విషయాలకు కాదన్న న్యాయస్థానం.. పరీక్షా కేంద్రాలకు ఠాగూర్ ఆడిటోరియం 2 కిలోమీటర్ల దూరం ఉందన్న వాదన యోగ్యం కాదని చెప్పింది. యూనివర్సిటీలో ఏ కార్యక్రమం సరైందో కాదో రిజిస్ట్రారే నిర్ణయం తీసుకోగలరని అభిప్రాయపడింది.
ఓయూ రిజిస్ట్రార్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.. యూనివర్సిటీలు విద్య, శిక్షణ, విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలని తెలిపింది. వర్సిటీలోకి బయటి వ్యక్తులను అనుమతించరాదని.. ముఖ్యంగా రాజకీయ నేతలు, మాజీ విద్యార్థుల జన్మదిన వేడకలకు అనుమతిస్తే వివక్ష ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుందని తెలిపింది. భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలకు అనుమతించవద్దని రిజిస్ట్రార్ ను హెచ్చరించింది.
Advertisements
క్యాంపస్ లో రాజకీయ కార్యక్రమాలను నిషేధించేలా సమగ్ర, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది హైకోర్టు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండేలా యూనివర్సిటీలు చర్యలు తీసుకోవాలని.. ఆ కార్యక్రమాలు నిర్వహించకుండా ఇతర యూనివర్సిటీలు కూడా మార్గదర్శకాలు తయారు చేయాలని స్పష్టం చేసింది.