అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాటికి సంబంధించిన కేసులను ఏపీలోని ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది హైకోర్టు. వేలం ద్వారా వచ్చిన రూ.50కోట్లు కూడా ఏలూరు కోర్టుకే బదిలీ అయ్యేలా ఆదేశాలు ఇచ్చింది.
ఏడేళ్లుగా హైకోర్టులో అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ వివాదాలు కొనసాగుతున్నాయి. విచారణ చేపట్టాలని డిపాజిటర్లు, బ్యాంకుల అభ్యర్థనను తిరస్కరిస్తూ.. తమ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు తెలిపింది ఉన్నత న్యాయస్థానం.
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ సంబంధించిన కేసులన్నింటిపై విచారణ ముగించింది హైకోర్టు. ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం విచారణాధికారం ఏలూరు కోర్టుకే ఉందని స్పష్టం చేసింది.
ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశచూపి భారీగా డబ్బులు వసూలు చేసి జనాన్ని నిలువునా ముంచాయి అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ సంస్థలు. వాటి దోపిడీకి గురై వందలాది మంది ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. డిపాజిట్ చేసిన సోమ్మును తిరిగి చెల్లించాలని బాధితులు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు.