కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. 40 మంది రైతులు పిటిషన్ దాఖలు చేశారు. తమ భూముల్లో కాకుండా ప్రభుత్వ ల్యాండ్స్ లో రీక్రియేషన్ జోన్ తరలించాలని అందులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా కలెక్టర్ ను ప్రతివాదులుగా అందులో చేర్చారు.
మొత్తం 200 ఎకరాల్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ కు ప్లాన్ చేసింది. దీన్ని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాది సృజన్ కుమార్ రెడ్డి రైతుల తరఫున వాదనలు వినిపించనున్నారు. హైకోర్టు విచారణపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ముందుగా చెప్పినట్టే రైతు జేఏసీ నిరసనలకు సిద్ధమయ్యారు. ఈమధ్యే భేటీ అయిన 7 గ్రామాల రైతులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గురువారం 49 మంది కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ఈనెల 11 తర్వాత ఉద్యమం మరింత ఉద్ధృతం చేయాలని చూస్తున్నారు.
అయితే.. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాత్రం రైతులు అధైర్యపడొద్దని చెబుతున్నారు. వారి భూముల జోలికి వెళ్లమని అంటున్నారు. ఇటు కలెక్టర్.. ఇది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమేనని ఫైనల్ కాదని క్లారిటీ ఇచ్చారు.