వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చెన్నమనేని రమేష్ హైకోర్టు ను ఆశ్రయించారు. ఇదే పిటిషన్ లో ఇంప్లీడ్ అయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్… కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు.
భారత పౌరుడు కాదు అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించిన నేపథ్యంలో… భారత పౌరుడు కాని వ్యక్తి ఎమ్మెల్యే గా ఎన్నిక కావడాన్ని ఆది శ్రీనివాస్ సవాలు చేస్తున్నారు. మరోవైపు రిట్ పిటీషన్ పెండింగ్ లో ఉన్న సమయంలో చెన్నమనేని జర్మనీ పాస్ పోర్టు తో జర్మనీ కి వెళ్లారని కోర్టుకు తెలిపిన ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది, ఈ విషయాన్ని తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొనలేదన్నారు.
జర్మనీ పాస్ పోర్టు తో పాటు జర్మనీ పౌరసత్వం ఇంకా చెన్నమనేని రమేష్ కలిగి ఉన్నాడా….రద్దు చేసుకున్నాడా అని గతంలోనే కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు, భారతీయ పౌరసత్వం పొందిన తర్వాత భారత పాస్ పోర్టు పొందాడా…తెలపాలని కేంద్రాన్ని ప్రశ్నించింది. జర్మనీ పౌరసత్వం, పాస్ పోర్టు పై పూర్తి సమాచారం తెలపాలని కేంద్ర హోంశాఖను ఆదేశించగా… జర్మనీ, భారత రాయబారి కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలపాలని కోరింది. బుధవారం జరగనున్న విచారణలో అన్ని వివరాలను కేంద్రం అఫిడవిట్ ద్వారా ఇవ్వనుండటంతో కేంద్ర ప్రభుత్వ వాదనను బట్టి చెన్నమనేని భవిష్యత్ ఆధారపడనుంది.
చెన్నమనేని రమేష్ ప్రస్తుతం జర్మనీలోనే ఉన్నారు. కరోనా లాక్ డౌన్ సమయం నుండి ఆయన అక్కడే ఉన్నారు.