దిశ నిందితుల మృతదేహలు అప్పగించే అంశంపై విచారణ జరిపిన హైకోర్టులో వాడి వేడి వాదనలు కొనసాగాయి. ప్రభుత్వ న్యాయవాదికి, పిటిషనర్‌కు మధ్య వాద ప్రతివాదనలు జరగ్గా… మృతదేహల అప్పగింతపై తమదే తుది నిర్ణయమని, సుప్రీం కోర్టు కూడా తమకే ఆ భాద్యతను కట్టబెట్టిందని హైకోర్టు స్పష్టం చేసింది.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే సుప్రీంలో విచారణ కొనసాగుతుండగా… రిటైర్డ్ జడ్జ్ ఆద్వర్యంలో త్రి సభ్య కమిషన్‌ను కూడా విచారణ కోసం సుప్రీం నియమించింది. ఇందుకోసం 6 నెలల గడువు కూడా విధించింది. దీంతో మృతదేహల అప్పగింతపై సందిగ్ధత కొనసాగుతుంది.
మృతదేహాలు ఇప్పటికే కుళ్లిపోయే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి రావటంతో శనివారం ఉదయం గాంధీ ఆసుపత్రి వైద్యుల వాదనను హైకోర్టు వినబోతుంది. అయితే… రీపోస్ట్‌మార్టం చేయకుండా మృతదేహలను ఎలా అప్పగిస్తామంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో నిష్ణాతులైన గాంధీ ఆసుప్రతి వైద్యులే పోస్టుమార్టం చేశారని ప్రభుత్వం వాదిస్తూ… అవసరమైతే మరోసారి వారితోనే పోస్ట్‌మార్టం చేయించాలని కోరింది.
గాంధీ ఆసుపత్రి వైద్యుల సలహా విన్న తర్వాత రీపోస్ట్‌మార్టం చేయాలా…? మృతదేహలు కుళ్లిపోతున్నాయా…? భద్రపర్చే అవకాశం లేదా…? రీపోస్ట్‌మార్టం అవసరం అయితే ఎవరితో చేయించాలి అన్న అంశాలపై శనివారం హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది.