శివమాలలు తీసివేస్తేనే కానీ లోపలికి రానివ్వమని పోలీసులు శివస్వాములకు చెప్పడంతో వారు మేము మాలలు తీయమని చెప్పడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పోలీసులు ఉన్నారు. మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం దేవనూరులో చోటు చేసుకున్న గొడవలో 5 గురు శివస్వాములను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని శనివారం రిమాండుకు తరలించేందుకు తాండూరు పోలీసులు పరిగి సబ్ జైలుకు తీసుకుని వచ్చారు.
అయితే వారిని జైలు లోపలికి అనుమతించాలంటే శివమాలలు తీసివేసి రమ్మన్నారు. ఆ తర్వాత జైల్లోకి తీసుకుని వెళ్లి మళ్లీ బయటకు తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు పోలీసులు. ఇప్పుడు ఈ అంశం కాస్త చర్చనీయాంశంగా మారింది. మాయమాటలు చెప్పి తమను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారని శివస్వాములు ఆరోపించారు. మాలలు తీసే ప్రసక్తి లేదని శివస్వాములు తేల్చి చెప్పగా.. పోలీసులు ఏం చేయలేని స్థితిలో పడ్డారు.
ఈ క్రమంలో మీడియాతో సహా అందర్నీ జైలు ఆవరణ నుంచి పోలీసులు పంపించేశారు. ఆ తర్వాత రిగి ఎస్సై విఠల్ రెడ్డి జైలు సిబ్బందితో మాట్లాడి, శివస్వాములను జైల్లోకి పంపడంతో హైడ్రామా అంతటితో ముగిసిపోయింది. శివస్వాములతో పాటు యంగ్ రీడర్స్ వ్యవస్థాపకుడు -మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్ ను కూడా పోలీసులు రిమాండ్ కు తరలించారు.
శివస్వాములను రెచ్చగొట్టి, హింసకు ప్రేరేపించాడంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గతంలో యంగ్ లీడర్స్ స్థాపించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకు కారణం కాగా.. కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే తో పొసగక బీజేపీలో చేరారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనను కేసులో ఇరికించారంటున్న మురళీ కృష్ణ గౌడ్, ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.