ప్రధాని ఇమ్రాన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం సినిమాను తలపించింది. మొదటి నుంచి ఊహించని మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపింది. సభ పలుమార్లు వాయిదా పడుతూ ప్రారంభమవుతుండటంతో ఏ క్షణం ఏమవుతుందోనని ఆ దేశ ప్రజలు, రాజకీయ పండితులు టీవీల ముందే ఉండిపోయారు.
సరిగ్గా వారం క్రితం పాక్ పార్లమెంట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుందని అంతా భావించారు. ఇక ప్రధాని ఇమ్రాన్ పని అయిపోయిందనుకున్నారు.
కానీ ఇంతలోనే డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ ఖాన్ సూరి షాక్ ఇచ్చారు. ఈ ఈ తీర్మానం రాజ్యంగంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని, దీని వెనక విదేశీ కుట్రలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో ప్రతిపక్షాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ పై వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రతిపక్షాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రధాని ఇమ్రాన్ పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని తీర్పునిచ్చింది.
ఈ క్రమంలో శనివారం ఉదయం పాక్ పార్లమెంట్ సమావేశం ప్రారంభం అయింది. సభ ప్రారంభం అయిన వెంటనే అవిశ్వాసంపై ఓటింగ్ కు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అటు అవిశ్వాసతీర్మానం వెనక విదేశీ కుట్రపై ముందు చర్చజరగాలని పాలక పార్టీ పట్టుబట్టింది. దీంతో సభను మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశాన్ని వాయిదా వేశారు.
విదేశీ కుట్రపై సుదీర్ఘ ప్రసంగాలు చేసి ప్రతిపక్షాలకు అవిశ్వాసంపై చర్చకు సమయం ఇవ్వకుండా చేయాలని పాలక పార్టీ వ్యూహాలు చేసింది. ఈ క్రమంలో పలు మార్లు సభ వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 9 గంటలకు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీంతో ఇమ్రాన్ ఏం చేయబోతున్నారో, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాడోనన్న ఉత్కంఠ నెలకొంది.
శనివారం అర్ధరాత్రి దాటాక అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు. ఇందులో అవిశ్వాసానికి అనుకూలంగా 174 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాసం నెగ్గినట్టైంది. ఈ మేరకు ప్రధాని ఇమ్రాన్ పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.