ప్రపంచాన్నంతా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా సంభవించిన కరోనా ప్రపంచాన్ని ముంచెత్తింది. మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. కానీ ఒమిక్రాన్ తో భారత్‌కు పెద్దముప్పైతే ఏం లేదని నిపుణులు వెల్లడించారు. భారతీయుల్లో సీరోపాజిటివిటీ రేటు అధికస్థాయిలో ఉందని తెలిపారు. భారత్ 70 నుంచి 80 శాతం సీరో పాజిటివిటీ రేటు కలిగి ఉందని సీఎస్‌ఐఆర్ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ఓ మీడియా సంస్థకు తెలిపారు.
నగరాల్లో 90 శాతానికి పైగా ప్రజలు ప్రతిరోధకాలను కలిగి ఉన్నారు. దీంతో ప్రజలు వ్యాధి బారినపడినప్పటికీ, లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయని వెల్లడించారు. టీకా కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసి, చిన్నారులకు కూడా టీకాలు అందజేస్తే కరోనాను అరికట్టవచ్చని తెలిపారు. వైరస్ భారీస్థాయిలో ప్రబలకుండా ఉండాలంటే మాస్కులు వాడటం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్ నియమావళిని తప్పకుండా పాటించాలని మిశ్రా సూచించారు.