తూ.గో జిల్లా అనపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే సూర్యానారాయణ రెడ్డి , టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరస్పర సవాళ్లు.. జనానికి లేని తలనొప్పిని తెచ్చిపెట్టాయి. సత్యప్రమాణానికి సై అంటే సై అంటూ రెండు మండలాల ప్రజలని ఇద్దరు నేతలు టెన్షన్ పెట్టారు. ఎక్కడ ఏం జరుగుతుందోనన్న భయంతో పోలీసులు.. బిక్కవోలు, అనపర్తి మండలాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీసు చట్టాన్ని అమలు చేయాల్సి వచ్చింది. ఫలితంగా నేతల చాలెంజ్‌ల సంగతి ఏమిటోగానీ.. సాధారణ జనం బయట తిరిగేందుకు టెన్షన్ పడ్డారు.
చివరికి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయానికి వేర్వేరుగా వచ్చి నేతలు సత్య ప్రమాణం చేశారు. తొలుత ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సత్యప్రమాణం చేయగా.. 10 నిమిషాల తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆలయంలోకి వెళ్లారు. అయితే ఆ సమయంలో మీడియాను పోలీసులు ఆలయంలోకి అనుమతించలేదు.
వివాదం ఏమంటే..
మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి… ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనికి స్పందించిన సూర్యనారాయణరెడ్డి బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణానికి సిద్దమా అంటూ సవాల్ విసిరారు. ఇద్దరూ సిద్దం కావడంతో నియోజకవర్గంలో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.