తెలంగాణ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గిరిజన సంఘాలు, టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాలు ముట్టడికి ప్రయత్నించాయి. అయితే.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించేలా.. కేంద్రం వైఖరి ఉందంటూ ముట్టడికి ప్రయత్నించారు ఆయా సంఘాల నేతలు. తక్షణమే కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో రోడ్డుపై బారికేడ్లు వేసి ఇరు వర్గాలను పోలీసులు నిలువరించారు. బీజేపీకి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు నినాదాలు చేయగా.. టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ, చిక్కడపల్లి, అబిడ్స్, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెబుతోంది. అయితే.. తమ దగ్గరకు బిల్లు రాలేదని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుండా పార్లమెంట్ లో ప్రకటన చేశారు. దీనిపై టీఆర్‌ఎస్ మండిపడుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ ఆఫీస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు గులాబీ శ్రేణులు.