పేపర్ లీకేజ్ ఘటనను ప్రతిపక్ష పార్టీలు మైలేజ్ కోసం వాడుకుంటున్నాయి. ఓవైపు బీజేపీ దీక్షలు, ధర్నాలు అంటూ హడావుడి చేస్తుంటే.. వైటీపీ కూడా టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే.. పార్టీ అధ్యక్షురాలు షర్మిల నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి ఆమెను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల… టీఎస్పీఎస్సీది పెద్ద స్కాం అని ఆరోపించారు. ఇది అందరూ కుమ్మక్కు అయ్యి చేసిన కుంభకోణమని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. బోర్డు చైర్మన్ దగ్గర నుంచి మంత్రుల స్థాయిలో ఇందులో హస్తముందని ఆరోపించారు. ప్రశ్నా పత్రాలు కావాలనే లీక్ చేశారన్న షర్మిల.. బోర్డు మొత్తం రద్దు చేయాలన్నారు.
ఈ కేసును సిట్ తో దర్యాప్తు కరెక్ట్ కాదని.. అది ప్రభుత్వానికి అనుకూలంగా విచారణ చేస్తుందని చెప్పారు షర్మిల. అందుకే, సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలన్నారు. టీఎస్పీఎస్సీ నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయిందన్న ఆమె… రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రిజిస్టర్ చేసుకున్నారన్నారని తెలిపారు.
బోర్డు ఛైర్మన్ కు, సెక్రెటరీకి తెలిసే పాస్ వర్డ్ లు బయటకు లీక్ ఎలా అయ్యాయని ఫైరయ్యారు. మూడో వ్యక్తికి ఎలా వెళ్లాయని అడిగారు. అంగట్లో సరుకులు అమ్మినట్లు టీఎస్పీఎస్సీ పేపర్లు అమ్ముతున్నారని.. ఒక్క ఏఈ పేపర్ కాదు… అన్ని పేపర్లు లీక్ అయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు షర్మిల.