రొంపిచర్ల ఫ్లెక్సీల అంశం ఎంతటి వివాదానికి దారి తీసిందో చూశాం. కేసులు, కోర్టుల వరకు వెళ్లింది. కొందర్ని జైలుకు పంపారు పోలీసులు. అయితే.. ఈ ఇష్యూలో టీడీపీ శ్రేణులను కావాలనే ఇరికించారనేది ఆపార్టీ నేతల వాదన. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ అయి పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ నేతలను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బయటకొచ్చాక మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
ప్రశ్నించిన వారిని చంపేస్తున్నారని, ఏపీలో మైనార్టీలకు మనుగడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ప్రభుత్వం కోడికత్తి డ్రామాలు ఆడొద్దని హెచ్చరించారు. టీడీపీ శ్రేణులపై పోలీసులు అతి దారుణంగా కేసులు పెట్టారని, కార్యకర్తల పట్ల పోలీసులు నీచాతి నీచంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. పోలీసుల తీరు ఉగ్రవాదులను తలపిస్తోందని చంద్రబాబు.. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమని వ్యాఖ్యానించారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ పాటించాలని, చట్టానికి ఎవరూ చుట్టాలు కాదన్నారు.
టీడీపీ ఫ్లెక్సీలను చింపివేస్తుంటే పోలీసులు గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు చంద్రబాబు. ఎందుకిలా చేస్తున్నారని అడిగిన పాపానికి.. టీడీపీ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఫైరయ్యారు. ఖబడ్దార్ పోలీసులు.. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తల కోసం జైలుకు వచ్చానని నీ పని.. నీ పార్టీ పని.. అయిపోయింది’ అంటూ జగన్ ను హెచ్చరించారు.
మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పీలేరులో కలకలం రేపాయి. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ సైకో చంద్రబాబు గో బ్యాక్.. పుంగనూరులో మతకలహాలు సృష్టిస్తున్నావ్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ఫ్లెక్సీల్లో కొన్ని ఫొటోలను కూడా ముద్రించారు.