పోలీస్ రిక్రూట్ మెంట్ విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి. పరీక్షల్లో మార్కుల అంశంలో ఫిజికల్ టెస్టుల విషయంలో అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్దతుల్లో కాకుండా కొత్త నిబంధనలతో జరిపి కావాలనే చాలామంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
తాజాగా ప్రగతి భవన్ ను ముట్టడించారు. పాత పద్ధతిలోనే పోలీస్ ఈవెంట్స్ జరపాలని డిమాండ్ చేస్తూ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు చూశారు. అందరూ ఒకచోటకు చేరి ప్రగతి భవన్ దగ్గరకు వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అభ్యర్థుల రాకను గమనించి పోలీసులు.. వాళ్లను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపు అభ్యర్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
దేశంలో 4 మీటర్ల లాంగ్ జంప్ ఎక్కడా లేదు. కానీ, తెలంగాణలో మాత్రం అమలు చేశారు. అలాగే.. 200 మార్కుల క్వశ్చన్ పేపర్ లో 20 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు. పేద విద్యార్థుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి.. ఇలా చేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు అభ్యర్థులు. ఇటు వీరి ధర్నాలకు ప్రతిపక్షాలు కూడా మద్దతుగా ఉంటున్నాయి.