తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా, టీచర్ల డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కార్యకర్తలు ప్రగతి వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పీఎస్ కు తరలించారు. అనంతరం గోషా మహల్ కు తరలించారు. బీజేపీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రగతి భవన్కు కిలోమీటర్ దూరం వరకు పోలీసులను మోహరించారు.
13 జిల్లాల్లో స్పౌజ్ టీచర్ల బదిలీలను బ్లాక్ చేయడంపై టీచర్లు ఆందోళనకు దిగారు. టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు ముందే తమను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పని చేయడం వల్ల తమతో పాటు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని అంటున్నారు.
అయితే మూడునాలుగు రోజులుగా టీచర్లు ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ మండిపడుతోంది. ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.